సాఫ్ట్‌వేర్ కోచింగ్ కోసం హైదరాబాద్ వచ్చి హాస్టల్‌లో జాయిన్ అయ్యాను. ఓ రోజు చల్లని సాయంకాలం వేళ హాస్టల్‌పైకి వెళ్లాను. నా మొబైల్ ఫోన్ ట్రింగ్ ట్రింగ్ మని మ్రోగింది. ఏదో ఎస్‌టీడీ నెంబర్‌నుంచి ఫోన్. హాలో.. ఎవరు అని అడిగాను. ' హాలో! ప్రసాద్ గారు' అని ఒక అమ్మాయి గొంతు. 'కాదండి' అని అన్నాను.
అమ్మాయి : మీరెవరు?
నేను : ఇంతకీ మీరెవరు?
అమ్మాయి : మీరు ప్రసాద్ గారేనా
నేను : కాదండీ బాబు! ఒకసారి నెంబర్ చెక్ చేసుకోండి
ఆ అమ్మాయి నమ్మలేదు. 'సరే! మీ పేరేంటి?' అని అడిగింది. 'ముందు మీ పేరు చెప్పండి' అన్నాను. ' నా పేరు అమ్మాయి ' అంది. ' అబ్బ ఛా! ఫోన్ పెట్టేయ్' అన్నాను. కాల్ కట్ చేసింది. మళ్లీ కాల్ చేసింది. మళ్లీ ఫోన్ పెట్టేయమని గట్టిగా అరిచాను.
తర్వాత రోజు మళ్లీ అదే టైంకు ఫోన్! మళ్లీ ట్రింగ్ ట్రింగ్ మంది.
' హలో ఎవరు?'
' హలో ప్రసాద్ గారేనా?'
'మళ్లీ నువ్వేనా ఏంటి? మళ్లీ మళ్లీ ఫోన్ చేస్తున్నావు'
'నిన్న ఫోన్ చేసింది నేను కాదు. నేను వేరే అమ్మాయిని'
'నిజం చెప్పు! నిన్న ఫోన్ చేసింది నువ్వే కదా?'
'కాదు'
' మరి ప్రసాద్ అని ఎందుకు అడిగావు'
'అది వేరే అమ్మాయి.. అప్పుడు నేను కూడా ఉన్నాను'
'నేను ప్రసాద్‌ను కాదు'
'తెలుసు బాబు నాకు, ఎందుకు అంత చిరాకు. ఫోన్ చేసింది నేనే కదా. నాకే కదా బిల్లు'
( అప్పుడే కొత్తగా మార్కెట్‌లోకి మొబైల్ ఫోన్ వచ్చింది. మొబైల్ ఫోన్‌లో మాట్లాడటం అంటే సరదా.)
' సరే చెప్పండి. నీ పేరు'
' శాంతి. మరి నీ పేరు.'
' రాజా'
అప్పటినుంచి మా మధ్య బంధం పెరిగింది. అలారం పెట్టుకుని ప్రతిరోజూ మాట్లాడుకునేవాళ్లం. మా ఇష్టాయిష్టాలు, అభిరుచులు కలిశాయి. ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడింది. ఓ రోజు కలుద్దామని అనుకున్నాం. ఓ డేట్ ఫిక్స్ చేసుకున్నాం. కానీ, నాకు జాబ్ రావటం వల్ల కలవలేకపోయాం. వేరేవేరే కారణాలతో అలా ఓ సంవత్సరం గడిచింది. మా మధ్య బంధం మరింత బలపడింది. ఆ తర్వాత శాంతి వాళ్ల ఇంట్లో తను ఫోన్ మాట్లాడుతున్న సంగతి తెలిసిపోయింది. ఓ రోజు నాకు ఫోన్ చేసింది. 'ఇమీడియట్‌గా ఫోన్ నెంబర్ మార్చు. మా వాళ్లు నీ నెంబర్ తీసుకున్నారు.' అని చెప్పింది. ఫోన్ నెంబర్ మార్చి కొత్త నెంబర్ ఇచ్చాను.
తీసుకెళ్లకుంటే చచ్చిపోతానంది..